ఆ.వె. జ్ఞానుల చరితము వీనుల న
నానుచు సత్పురుష గోష్ఠి ననఘంబనుచున్
బూనుము; ధర్మపథంబును
దానెరిగినయంత; మరువదగదు కుమారా!
— పక్కి అప్పల నరసయ్య
భావం : జ్ఞానుల చరిత్రలను చెవులలోకి ఎక్కించుకోవాలి. అంటే మనసులో పదిలపరచుకోవాలి. పాపాలను పోగొట్టే మంచి వారి స్నేహాన్ని చేయాలి. తెలిసినంత వరకు ధర్మమార్గంలో నడవాలి. ఇవి మరవకూడదు.
ఉద్దేశ్యం: శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది, వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
కవి పరిచయం
కవిపేరు : మారద వెంకయ్య
కాలం : 1550 – 1600 మధ్యకాలం
ఇతర పేర్లు : ఈయనను మారన వెంకయ్య, మారవి కవి అని కూడా అంటారు.
రచనలు : భాస్కర శతకం
ప్రత్యేకత : తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకంగా భాస్కరశతకం పేరు పొందింది. దృష్టాంతము అంటే ఉదాహరణ అని అర్ధం. కవి చెప్పదలచుకున్న నీతిని ఉదాహరణతో చెప్పడం వలన నీతిబోధ స్పష్టంగా, సులువుగా అవగాహన అవుతుంది.