మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట. మాటకున్న శక్తి గొప్పది. అది అవతలివారిని మెప్పించగలదు, నొప్పించగలదు, ఆపదలనుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు. అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమీ కాదు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తోంది ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడటం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు. చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు. బంధువులు ఆనందిస్తారు. అనుబంధాలు పెరుగుతాయి. అనురాగం పెంపొందుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసినవానికే ఈ కళ కరతలామలకమవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడు అవుతాడు.
ఉద్దేశం
విద్యార్థి వ్యక్తిత్వనిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభాకంపం నుండి బయటపడి మాటతీరు మెరుగుపరచుకోవటం అవసరం. విద్యార్థులలో సంభాషణానైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం.
రచయిత్రి పరిచయం
వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ చేశారు. 39 నవలలు, 100 కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్ లో సీరియల్ గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ఐదుసార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర పెర్ల్బక్ అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య, సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది.
జననం: 15.12 1933 మరణం: 13.04.2007
ప్రక్రియ వ్యాసం
ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ, విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు.