AP 10th Class Telugu Lesson కన్యాశుల్కం Kanyasulkam Guide: అన్ని సాహిత్య స్వరూపాలకన్నా నాటకం సమాజాన్ని గాఢంగా బంధిస్తుంది. అనుభవాలను ప్రతిబింబిస్తుంది. అందునా సాంఘిక నాటకం సమకాలీన సమాజంలోని ప్రతి సమస్యకు ప్రతిస్పందిస్తుంది. ప్రతిఘటనను ప్రతిఫలింప చేస్తూ ప్రజా జీవనాన్ని ప్రతిబింబింప చేస్తుంది సాంఘిక నాటకం. కాలానికి అనుగుణమైన ఇతివృత్తాలనే నాటక రచయితలు స్వీకరించాలని అంటాడు భాసుడు. సాంఘిక స్థితిగతులను సమగ్రంగా ప్రతిఫలింప చేయడమే సాంఘిక నాటక పరమ ప్రయోజనమని ఆర్ధర్ మిల్లర్ పేర్కొన్నాడు. సమకాలీన సమాజానికి ఫోటోగ్రాఫ్ వంటిదిగా నాటకాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి.
ఉద్దేశం: భారతదేశంలో ఆంగ్లవిద్యా విధానం అడుగిడుతున్న తొలిరోజులలో ఆనాటి సమాజంలో ఆంగ్లవిద్యను గురించి ప్రజలలో ఉన్న ఆలోచనా ధోరణిని తెలియ చెప్పడం, కొత్తకొత్త కొలువులు కావాలంటే ఆధునిక విద్యనభ్యసించాల్సిందేనని వెంకమ్మ లాంటి సాధారణ గృహిణి ఆనాడే గ్రహించిందని చెప్పడం, సమాజంలోని దురాచారాలు, సంఘసంస్కరణపై అవగాహన కల్పించి, విద్యార్థులను చైతన్యపరచడం ఈ పాఠం ఉద్దేశం.
రచయిత పరిచయం
రచయిత : గురజాడ అప్పారావు
కాలం : 1862 – 1915
తల్లిదండ్రులు : కౌసల్యమ్మ, వెంకట రామదాసు
జన్మస్థలం: విశాఖపట్టణం సమీపంలోని రాయవరం
రచనలు : నాటకాలు – కన్యాశుల్కం, కొండు భట్టీయం, బిల్హణీయం, కవితా సంపుటి – ముత్యాలసరాలు
కథలు : దిద్దుబాటు, పెద్దమసీదు, మీ పేరేమిటి?, సంస్కర్త హృదయం, మెటిల్డా
విశేషాంశాలు : ఆధునిక సాహిత్యానికి వేగుచుక్క గురజాడ.
కన్యాశుల్కం రచనా నేపథ్యం
1890 సంవత్సర కాలంలో విజయనగరం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కన్యాశుల్క వివాహ వివరాలు సేకరించారు ఆనంద గజపతిరాజు. ఈ సర్వే వలన ఏటా దాదాపు 344 బాల్యవివాహాలు జరిగేవనే విషయం కన్యాశుల్కం నాటకం రాయడానికి ప్రేరణ కలిగించింది. ఆనంద గజపతిరాజు సూచనతో తనను ఎంతో బాధించిన ఈ సామాజిక దురాచారాన్ని ఇతివృత్తంగా తీసుకొని, జనరంజకమైన నాటకంగా రూపొందించి, ప్రజలను చైతన్యం చేయాలి అనుకున్నారు గురజాడ. నిరక్షరాస్యులను సైతం ఆకట్టుకుని, ఆలోచింప చేసే ప్రక్రియ నాటకం అని భావించారు. సామాజిక సమస్యల పరిష్కారం కోసం పుట్టిన నాటకం కన్యాశుల్కం. సామాజిక, సాహిత్య ప్రయోజనాలను ఏకకాలంలో సాధించిన గొప్ప నాటకం ఇది. ఈ నాటకాన్ని ఉత్తరాంధ్ర మాండలికంలో రచించారు.