AP 10th Class Telugu 6th Lesson ప్రకృతి సందేశం Prakruthi Sandesam Study Material
సీ. కోడికుంపటి దింపుకొని పిల్లలను బిల్చి
కొసరి గింజియలేరుకొనుట నేర్పు
ఈని యీనకమున్నె మృగభామ పిల్లకు
వెనువెంట చెంగులు బెట్ట నేర్పు
ముందుబుట్టిన తీవె పందిరి కెగబ్రాకి
పసితీవియకు వెంట బ్రాక నేర్పు
నడువనేర్చిన బిడ్డ బుడతతమ్మునిఁ బ్రేమ
నడుగులో నడుగు లేయంగ నేర్పు,
తే,గీ. ప్రకృతి సర్వంబు నీ గురుత్వంబునందు
లీనమై యున్నయది నీవులేని సీమ
దీపమెత్తని వ్యర్థ మందిరము సుమ్ము
ప్రాభవంబోయి నీనోటి వాక్యమునకు.
- గుఱ్ఱం జాషువా (ఖండకావ్యం)
భావం : ప్రతి ఉదయం కోడి తన పిల్లలకు గింజలు ఏరుకోవడం నేర్పుతుంది. ఆడజింక తనకు పుట్టిన పిల్లకు తనతో పాటు చెంగుచెంగున ఎగరడం నేర్పుతుంది. ముందుగా పుట్టిన తీగ, తన వెనుక పుట్టిన పసితీగకు పందిరిపైకి పాకడం నేర్పుతుంది. నడవడం వచ్చిన పిల్లవాడు తన తమ్ముడికి ప్రేమతో చిన్న చిన్న అడుగులేయడం. నేర్పుతాడు. ప్రకృతి మొత్తం గురుభావనతో ముడిపడి ఉంది. గురువులులేని ప్రదేశం దీపంలేని ఇల్లు వంటిది.. గురువుల నోటి మాటలకు చాలా గొప్పతనం ఉంది.









